Rajasthan Royals: ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
- చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్
- 186 పరుగుల లక్ష్య ఛేదనలో 173 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- వరుసగా రెండో విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్
నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. 12 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 186 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన స్థితిలో రాజస్థాన్ బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుని గెలిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 173 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రెండో విజయం సాధించగా.. ఢిల్లీ రెండవ ఓటమిని మూటగట్టుకుంది.
భారీ లక్ష్య ఛేదనలో మిచెల్ మార్ష్ (23), వార్నర్(49) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు. కెప్టెన్ పంత్ (28) ఫర్వాలేదనిపించాడు. అయితే వార్నర్, పంత్ ఔటయ్యాక ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. చివరిలో స్టబ్స్ అనూహ్యంగా చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రేసులోకి వచ్చినట్టు కనిపించింది. అశ్విన్ వేసిన 17వ ఓవర్‌లో చివరి 2 బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్‌లో 17 పరుగులుగా మారింది. క్రీజులో స్టబ్స్, అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వీరిద్దరినీ నిలువరించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆరంభంలో యశస్వి (5), బట్లర్ (11) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ (15) కూడా నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత అశ్విన్, రియాన్ పరాగ్ అదరగొట్టారు. 19 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. ఇందులో 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక పరాగ్ విధ్వంసం సృష్టించాడు. 45 బంతుల్లో 84 పరుగులు బాదాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఖలీల్ వేసిన 15వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4 బాదాడు. ఇక నోకియా వేసిన చివరి ఓవర్‌లో 4, 4, 6, 4, 4 రాబట్టాడు. చివరిలో ధ్రువ్ జురెల్ (20), హెట్‌మెయర్ (14 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించారు.