CM Jagan: ఈ పథకాలన్నీ ఆ ఆలోచన నుంచి పుట్టినవే: ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- కర్నూలు జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
- ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ
- పాదయాత్రలో అనేక సమస్యలు చూశానని సీఎం జగన్ వెల్లడి
- 58 నెలల పాలనలో మీకు జరిగిన మంచి చూడాలని విజ్ఞప్తి
- ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టాలని సూచన
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పాదయాత్రలో తాను చూసిన ప్రజల సమస్యలను గత 58 నెలల పాలనలో పరిష్కరించేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. విద్యారంగంలో జరిగిన మార్పులకు గర్వపడుతున్నానని తెలిపారు. పిల్లల చదువు గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, మీ పిల్లల భవిష్యత్ కోసం నేను సిద్ధం... మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.
పేదింటి అక్కచెల్లెమ్మలు ఎంత కష్టపడుతున్నారో పాదయాత్రలో తాను చూశానని అన్నారు. లక్షల సంఖ్యలో బడుగు జీవుల కుటుంబాలు తమ బతుకు బండిని ఎంత కష్టంగా లాగుతున్నాయో కళ్లారా చూసుకుంటూ వచ్చానని వివరించారు.
"ఒక రోజుకూలీ, ఒక ఆటో డ్రైవర్, కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ, దోసెలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క, కుట్టుమిషన్ కుట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునే ఓ చెల్లి... వీరంతా బాగుండాలి, వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకం తీసుకువచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టినవే ఓ అమ్మ ఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, ఓ తోడు, ఓ చేదోడు, ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా పథకాలు.
కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను, ఛిన్నాభిన్నమైన పరిస్థితులను చూసి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని పుట్టింది ఓ అసరా అనే పథకం, ఓ సున్నా వడ్డీ పథకం.
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్న మహిళలు బాగుంటేనే వారి కుటుంబాలు బాగుంటాయన్న ఆలోచన నుంచి పుట్టింది చేయూత పథకం, ఇలాంటివే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ పథకం.
అందుకే అడుగుతున్నా... ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. ఐదేళ్లుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలలో వెలుగులు నింపడం చూశారు. మే సోదరుడిగా అడుతున్నా... రాఖీ కట్టండి అని ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మను అడుగుతున్నా.
నా చేతికే కాదు... మీ ప్రభుత్వానికి కూడా రాఖీ కట్టండి అని ప్రతి అక్కచెల్లెమ్మను కోరుతున్నా. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టమని అక్కచెల్లెమ్మలను కోరుతున్నా" అని విజ్ఞప్తి చేశారు.