Chandrababu: అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్: ఉదయగిరిలో చంద్రబాబు

Chandrababu take a jibe at CM Jagan in Udayagiri

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • ఉదయగిరిలో భారీ సభ
  • సీఎం జగన్ పై విరుచుకుపడిన చంద్రబాబు
  • రాబోయే రోజుల్లో నీ బతుకు భయంకరం అవుతుందని వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సాయంత్రం కావలి సభ ముగిసిన అనంతరం చంద్రబాబు ఉదయగిరి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

"నిన్న ఆ అమ్మాయి (వివేకా కుమార్తె  సునీత) ఒక మాట అడిగింది. అందుకు జగన్ మాపై ఆరోపణలు చేస్తున్నాడు. వాళ్లను కూడా నేను మేనేజ్ చేశానంట. మీ చెల్లెళ్లను నేనే మేనేజ్ చేశాను... రాజకీయ పార్టీలను నేనే మేనేజ్ చేశాను... ఇప్పుడు ప్రజలను కూడా మేనేజ్ చేస్తున్నా... ఇలా ఉన్నాయి నీ మాటలు! చివరికి నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా తయారవుతుంది. అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్. 

తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నాను... తిరిగి నాపైనే కేసులు పెడతావా? అని ఆ అమ్మాయి (సునీత) అడిగింది. ఆ హత్య ఎవరు చేయించారో హంతకుడు స్పష్టంగా చెప్పాడు... అలాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని ఓటు వేయమని అడుగుతున్నావు... నీకు మనసెలా ఒప్పింది? బంధుత్వానికి, ప్రేమకు ఇదేనా నువ్వు ఇచ్చే విలువ? అని ఆ అమ్మాయి అడిగింది. 

నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు... నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పి, ఆ తర్వాతే ప్రజలను ఓటు అడగాలి. నిందితుడు ఎవరో సీబీఐ కూడా చెప్పింది. అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డుకుని అతడ్ని కాపాడారు. వేరేవాళ్లపై అభాండాలు వేసి బతికిపోవాలనుకుంటున్నారు... ఈ ఆటలు సాగవు.

నిన్నా మొన్నా కలియుగం గురించి మాట్లాడుతున్నాడు. కలియుగంలో అనేక సంగతులు జరుగుతున్నాయంట. గొడ్డలితో నరికిన వాడ్ని కాపాడుతూ, ఆ నేరం బాధితులపైనే నెట్టడం ఉంది చూడు జగన్ మోహన్ రెడ్డీ... అదీ కలియుగం! చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం ఉంది చూడు... అదీ  కలియుగం! అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వస్తే... సీబీఐని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్లపైనే కేసులు పెడితే, వాళ్లు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఉంది చూడు... అదీ కలియుగం! హత్యలు చేసిన నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే వాళ్లు అధికారంలో ఉండడమే కలియుగం మహిమ! అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం కలియుగం మహిమ! 

ఇవాళ జగన్ ఒక మాట అంటున్నాడు. ఆయనకు ఎవరూ లేరంట. ఒంటరివాడంట. పేపరు లేదంట, టీవీ లేదంట. అందరూ ఆయనపై దాడి చేస్తున్నామంట. నువ్వు చేసిన తప్పులకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక ఊర్లోకి దొంగ వస్తే ఇంటింటికీ ఒకరు కర్ర పట్టుకుని ఆ దొంగను తరుముతారా లేదా? ఇక్కడ కులం, మతం చూసుకుంటారా? అదే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి! 

ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకారుడు, ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే, భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తుంటే అందరూ ఒక్కటవ్వాలా, వద్దా? ఆ విధంగా ప్రజలు ఏకమవ్వాలనే నేను కోరుతున్నా" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News