Madhya Pradesh: రూ.46 కోట్ల లావాదేవీలు జరిపారంటూ విద్యార్థికి ట్యాక్స్ నోటీసులు.. కంగుతినే రీతిలో పాన్‌కార్డ్ దుర్వినియోగం!
- కంపెనీ ఏర్పాటు చేసి లావాదేవీలు జరిపారన్న ఆదాయ పన్ను విభాగం
- ముంబై, ఢిల్లీ నగరాల్లో 2021లో కంపెనీలను నడిపించారని నోటీసుల్లో పేర్కొన్న అధికారులు
- తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులు ట్యాక్స్ నోటీసులు పంపించారు. రూ.46 కోట్ల లావాదేవీలపై పన్నులు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులు చూసిన సదరు విద్యార్థి షాక్‌కు గురయ్యాడు. ఈ లావాదేవీలకు, తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. ఈ మేరకు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. తన పేరు ప్రమోద్ కుమార్ దండోటియా(25) అని, తన పాన్‌కార్డ్‌తో ఒక కంపెనీ రిజిస్టర్ చేసి ఉందని, పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగం నుంచి ట్యాక్స్ నోటీసులు వచ్చాయని యువకుడు వాపోయాడు. ముంబై, ఢిల్లీ నగరాల్లో 2021లో ఈ కంపెనీలను నిర్వహించారని అందులో పేర్కొన్నారని వివరించాడు.
తాను గ్వాలియర్‌లో ఓ కాలేజీ విద్యార్థినని, పాన్‌కార్డు ఏ విధంగా దుర్వినియోగం అయిందో తెలియదని, లావాదేవీలు ఏ విధంగా జరిగాయో తెలియదని చెప్పాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ అధికారులను సంప్రదించానని చెప్పాడు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, శుక్రవారం మరోసారి గ్వాలియర్ ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశానని వివరించాడు.
ప్రమోద్ కుమార్ ఫిర్యాదుపై ఏఎస్పీ షియాజ్ స్పందిస్తూ.. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.46 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు యువకుడు ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. పాన్‌కార్డును దుర్వినియోగం చేసి దాని ద్వారా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి భారీ మొత్తంలో లావాదేవీలు జరిపినట్టుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్టు వెల్లడించారు.