Virat Kohli: చేతులు కలిపి.. ఆప్యాయంగా కౌగిలించుకొని.. కలిసిపోయిన విరాట్ - గౌతమ్ గంభీర్.. వీడియో ఇదిగో
- గతేడాది వైరం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్న కోహ్లీ-గంభీర్
- ఆర్సీబీ, నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన జరిగింది. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా గొడవపడ్డ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత రాత్రి ఒకరినొకరు పలకరించుకున్నారు. వివాదానికి ముగింపు పలుకుతూ ఇరువురూ కరచాలనం చేసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకోవడం కనిపించింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ ‘స్ట్రేటజిక్ టైమ్‌ఔట్’ సమయంలో ఆసక్తికరమైన ఈ పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతాకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ ముందుగా తన జట్టు ఆటగాళ్లను పలకరించాడు. అనంతరం పక్కనే డ్రింక్స్ తాగుతున్న విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి పలకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా గతేడాది ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ గొడవపడ్డారు. గతేడాది లక్నో జట్టుకు గంభీర్ కోచ్‌గా వ్యవహరించాడు. మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లక్నో బౌలర్ నవీన్ హుల్ హక్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కోహ్లీ కూడా నోటికి పని చెప్పాడు. మైదానంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా.. మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య గొడవగా మారింది.
ఇక 2013లో కూడా బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో వీరిద్దరూ గొడవపడ్డ విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో ఒకరినొకరు తిట్టుకున్నారు. పరస్పరం నెట్టివేసుకొనే పరిస్థితికి కూడా వచ్చారు. అయితే ఇతర ఆటగాళ్లు కలగజేసుకొని ఇద్దరినీ విడదీశారు. ఆర్సీబీ ఓటమిని చూడటానికి ఇష్టపడతానని, తాను కలలో కూడా ఓడించాలని కోరుకునే జట్టు ఆర్సీబీ అని గంభీర్ ఆ సమయంలో వ్యాఖ్యానించాడు. అంతలా వైరం ఉన్న వీరిద్దరూ తాజాగా కలిసిపోవడం పట్ల ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.