Youtuber Kidnap: యూట్యూబర్ ను కిడ్నాప్ చేసిన హైతీ గ్యాంగ్.. 6 లక్షల డాలర్ల డిమాండ్

USA YouTuber YourFellowArab Kidnapped In Haiti

  • గ్యాంగ్ లీడర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించగా ఎత్తుకెళ్లిన వైనం
  • గ్యాంగ్ స్టర్ల బందీగా అమెరికాకు చెందిన ‘యువర్ ఫెల్లో అరబ్’ ఛానల్ యువకుడు
  • ఫొటో విడుదల చేసి, డబ్బులిస్తే కానీ వదలమని తేల్చిచెప్పిన కిడ్నాపర్లు

కరీబియన్ దేశం ‘హైతీ’లో పేరుకే ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం.. దేశంలోని చాలాప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్ లు సర్వసాధారణం.. అలాంటి చోటుకు ఓ యూట్యూబర్ వెళ్లాడు. అక్కడి టూరిస్టు ప్రాంతాలను చూసి, తిరిగి వచ్చేయకుండా హైతీలోనే అత్యంత పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్ ను తన ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో సదరు గ్యాంగ్ స్టర్లు ఈ యూట్యూబర్ ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఆరు లక్షల డాలర్లు ఇస్తే కానీ వదిలేది లేదంటూ ఫొటోలు, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గ్యాంగ్ స్టర్ల చెరలో ఉన్న ఆ యూట్యూబర్ పేరు పియర్ మలూఫ్.. అమెరికాకు చెందిన మలూఫ్ తన ఛానల్ పేరు ‘యువర్ ఫెల్లో అరబ్’ తోనే ఎక్కువగా పాప్యులర్ అయ్యాడు.

హైతీలో అడుగుపెట్టిన 24 గంటల్లోనే మలూఫ్ ను, ఆయన హైతీ మిత్రుడిని మవోజో గ్యాంగ్ కు చెందిన 400 మంది గ్యాంగ్ స్టర్లు కిడ్నాప్ చేశారు. ఈ నెల 14న ఈ ఘటన జరిగింది. మలూఫ్ కుటుంబ సభ్యులు ఇప్పటికే 40 వేల డాలర్లు కిడ్నాపర్లకు చెల్లించినట్లు సమాచారం. కాగా, తోటి యూట్యూబర్లు కూడా మలూఫ్ ను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

హైతీలో మలూఫ్ కు సాయంగా ఉన్న స్థానికుడు సియాన్ రూబెన్స్ జీన్ సాక్రాను కూడా గ్యాంగ్ స్టర్లు కిడ్నాప్ చేశారు. అయితే, గ్యాంగ్ స్టర్లు వదిలేసినా సరే మలూఫ్ తో పాటే సియాన్ ఉంటున్నాడని మరో యూట్యూబర్ చెప్పారు. మలూఫ్ క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఫాలోవర్లు కోరుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కలుగజేసుకునే అవకాశంలేదని అధికారవర్గాలు తేల్చిచెప్పాయి. మలూఫ్ పంపిన చివరి వీడియోను ఆయన ఎడిటర్ సోషల్ మీడియాలో పెట్టారు. ఓ పెద్ద హోటల్ లో తానొక్కడినే ఉన్నానంటూ మలూఫ్ చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News