Raghu Rama Krishna Raju: కాబోయే సీఎం చంద్రబాబే.. నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది: రఘురామకృష్ణరాజు
- ఆర్థిక బలం ఎక్కువగా ఉన్న వైసీపీని తక్కువగా అంచనా వేయొద్దన్న రఘురాజు
- తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయబోనని స్పష్టీకరణ
- కూటమి తరపున టికెట్ వస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్య
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు. సీఎం జగన్ కు ఆర్థిక బలం చాలా ఎక్కువగా ఉందని... అందువల్ల ప్రత్యర్థి వైసీపీని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదని అన్నారు. జగన్ చెపుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు.
కూటమి తరపున రఘురాజుకు ఏ పార్టీ కూడా టికెట్ కేటాయించని సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ... కూటమి తరపున తనకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదని చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదని.. అందుకే తన గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చని అన్నారు.
నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసని... వివేకా హంతకులు ఎవరో దేవుడికి తెలుసంటూ అవినాశ్ రెడ్డిని పక్కన పెట్టుకుని జగన్ మాట్లాడటం సిగ్గుచేటని రఘురాజు విమర్శించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కోరి... సీఎం అయిన తర్వాత ఆ కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నావని ప్రశ్నించారు.