Gadchiroli Encounter: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ

Maoist Spokes Person Jagan Writes Letter About Naxals Encounter

  • గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలన్న మావోయిస్టులు
  • బీజేపీతో చేతులు కలిపి మావోయిస్టులను తుదముట్టించే ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయని ఆరోపణ
  • ఆహారంలో విషం పెట్టి హతమార్చారని ఆరోపణ
  • తెలంగాణ ప్రభుత్వానికి మట్టి అంటకుండా మహారాష్ట్ర పోలీసులే ఎన్‌కౌంటర్ చేశారని ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • ఆదివాసీలను దేశ పౌరులుగా గుర్తించడం లేదని ఆవేదన
  • ఎన్‌కౌంటర్‌కు రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్

గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన పేరుతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మార్చి 19న గడ్చిరోలిలోని కొల్లమర్క అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ పేరిట తమ కామ్రేడ్లు మంగు (డీవీపీఎం), వర్గేశ్ (వీఎం), రాజు (పీఎం), బుద్రాం (పీఎం)లను హత్య చేశారని ఆరోపించారు. 

అన్నంలో విషం పెట్టి..
గడ్చిరోలిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని, తెలంగాణ ప్రభుత్వం తమ పోలీసుల ద్వారా జరిపించిందని జగన్ ఆ లేఖలో ఆరోపించారు. ఆహార పదార్థాల్లో విషం పెట్టి వారు స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి క్రూరంగా హత్యచేశారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఎస్పీ ఈ పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ నెత్తుటి మరకలు తమ చేతులకు అంటుకోకుండా మహారాష్ట్ర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వారు మరణించినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు నిర్మూలన కోసం నిర్ణయాత్మక యుద్ధాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన మంచిర్యాల, భూపాలపల్లి, గడ్చిరోలి జిల్లాల ఎస్పీలతో సంయుక్త సమావేశం జరిపారని పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రజాస్వామ్యం ముసుగువేసుకున్న కాంగ్రెస్ దమననీతి ఏంటో అర్థమవుతోందని పేర్కొన్నారు. 

వారిని విడిచిపెట్టాలి
ఈ నెల 8న బీజాపూర్ జిల్లా ఉపూర్ బ్లాక్ తుమ్మిరెల్లికి చెందిన మాదేవ్, మాడ్కాల్ అనే ఇద్దరు అమాయక ఆదివాసీ యువకులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్ట్ చేసి మాయం చేశారని లేఖలో జగన్ ఆరోపించారు. వారి కోసం కుటుంబ సభ్యులు 25 రోజులుగా తిరుగుతున్నా పోలీసులు వారి ఆచూకీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయలేదని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చర్ల పోలీసులు బీజాపూ్ జిల్లా నేంద్ర గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఆదివాసీలను బతకనివ్వడం లేదని, వారిని దేశ పౌరులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు, ఆదివాసీ యువకులను మాయం చేసిన ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని, మాయం చేసిన యువకుల వివరాలను ప్రకటించాలని, వారిని మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో జగన్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News