RS Praveen Kumar: కేకే, కడియం దారిలో నడవాలని ఫోన్లు వచ్చాయి.. నేను గొర్రెను కాను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

I wont leave BRS say RS Praveen Kumar

  • ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ ను వీడనన్న ప్రవీణ్ కుమార్
  • పిరికిపందలకు బీఆర్ఎస్ లో స్థానం ఉండకూడదని వ్యాఖ్య
  • ఓటమితో వచ్చే నష్టాలను భరించేవాడే నిజమైన నాయకుడన్న ప్రవీణ్

కె కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని, మీరు కూడా వారి బాటలోనే నడిచి మంచి మార్గాన్ని వెతుక్కోవాలని కొందరు ఫోన్లు చేసి చెప్పారని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తాను గొర్రెను కాను, కాలేనని అన్నారు. ఎక్కడికో వెళ్లాలనే ఆలోచన తనకు లేదని, ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ ను వీడనని తెలిపారు. బాగా ఆలోచించే తాను బీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. 

గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగిన వాడే నిజమైన నాయకుడని ప్రవీణ్ అన్నారు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్ఎస్ వంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు పోలీసు కేసులు పెడుతున్నారని, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న కుట్రపూరిత దాడులను అందరం తిప్పికొట్టాలని అన్నారు. 

వెన్నుపోట్లు, కుట్రలు, ద్రోహాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని... ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత కాలం ఏ శక్తీ మన ప్రస్థానాన్ని ఆపలేదని ప్రవీణ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప చెళ్లుమనేలా విజయభేరి మోగిద్దామని చెప్పారు.

  • Loading...

More Telugu News