Jeevan Reddy: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి రోహింగ్యాల అభ్యర్థి: ధర్మపురి అరవింద్
- జీవన్ రెడ్డి రోహింగ్యాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపణ
- తెలంగాణలో డజనుకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా
- నిజామాబాద్ లోక్ సభ నుంచి తాను మళ్లీ గెలవడం ఖాయమని వ్యాఖ్య
నిజామాబాద్ లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే జీవన్ రెడ్డి రోహింగ్యాల అభ్యర్థి అని, ఆయన బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థి అంటూ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. తాను భారతీయులు, హిందువుల అభ్యర్థిని అని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి రోహింగ్యాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు.
డజన్‌కు పైగా సీట్లు గెలుస్తాం
తెలంగాణలో డజనుకు పైగా లోక్ సభ సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 400కు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో బోర్డు వల్ల పసుపు ధర పెరిగి రైతులు లాభపడ్డారని... రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పారు. నిజామాబాద్ లోక్ సభ నుంచి మరోసారి తాను గెలవడం ఖాయమన్నారు. అవినీతి లేని పాలన అందిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇక్కడి రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు.
విపక్షాలు చేసే ఆరోపణలు పట్టించుకోవద్దని తనకు పసుపు రైతులు సూచించారన్నారు. ఈ ఎన్నికల్లో పసుపు రైతులు కూడా ప్రధాని మోదీని ఆశీర్వదించాలని కోరారు. పసుపు బోర్డు రైతులకు వరంగా మారిందన్నారు. తనకు పసుపు రైతుల ఆశీర్వాదాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీకి ఎవరితో పోటీ లేదు... ఆయనతో ఎవరూ పోటీ కాదని వ్యాఖ్యానించారు.