Bandaru Satyanarayana Murthi: ఏం పాపం చేశానని నాకు టికెట్ ఇవ్వలేదు? .. 26 రోజులుగా నాకు నిద్ర లేదు: టీడీపీ నేత బండారు సత్యనారాయణ
- వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయన్న బండారు
- తన కట్టె కాలేంత వరకు టీడీపీలోనే ఉంటానని వ్యాఖ్య
- జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టినా భయపడలేదన్న బండారు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఈసారి టికెట్ దక్కని సంగతి తెలిసిందే. దీంతో, ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని... అయితే ఆ ఆఫర్లను తాను తిరస్కరించానని చెప్పారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని... తన కట్టె కాలేంత వరకు తాను పసుపు జెండా మోస్తూనే ఉంటానని అన్నారు. తన చితి మీద కూడా పసుపు జెండా వేసి దహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఈరోజు ఆయన టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు టికెట్ రాకపోవడం బాధ కలిగించిందని బండారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని... తాను ఏం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారని అన్నారు. తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. గత 26 రోజులుగా తనకు నిద్ర లేదని తెలిపారు. తనపై జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టినా భయపడలేదని... ప్రభుత్వంపై పోరాటం చేశానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.