LSG VS PBJ: ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్
- పంజాబ్ కింగ్స్‌పై 21 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
- కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించినప్పటికీ ఎదురైన ఓటమి
- అరంగేట్ర మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన లక్నో ఆటగాడు
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ 70 పరుగులతో రాణించినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం తప్పలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించడంతో ఈ మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (70) , జానీ బెయిర్‌స్టో (42) రాణించారు. తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం అందించినప్పటికీ ఆ తర్వాత వచ్చినవారు అంతగా రాణించలేకపోయారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(19), జితేశ్ శర్మ(6), లివింగ్ స్టోన్ (28 నాటౌట్), సామ్ కరాన్(0), శశాంక్ సింగ్ (9 నాటౌట్) చొప్పున మాత్రమే పరుగులు చేశారు.
అరంగేట్ర ఆటగాడు మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన (గంటకు 155.8 కిలోమీటర్లు) బంతిని వేశాడు. 4 ఓవర్లు వేసిన మయాంక్ 27 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు ఇతర బౌలర్లు నవీన్ ఉల్ హాక్, కృనాల్ పాండ్యా కూడా సహకారం అందించడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, మొసిన్ ఖాన్ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (54), నికోలస్ పూరన్ (42) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు.