New Delhi: ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు
- ఢిల్లీలో ఓ వ్యక్తి నిర్వాకం.. అరెస్ట్ చేసిన పోలీసులు
- పోలీసు బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీసిన వైనం
- కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు. నగరంలో రద్దీగా ఉండే ఓ ఫ్లైఓవర్‌పై కారుని అడ్డంగా ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతడికి ఏకంగా రూ.36,000 జరిమానా విధించారు. నిందితుడి పేరు ప్రదీప్ ఢాకా అని, అతడు పోలీసులపై దాడికి కూడా యత్నించాడని పోలీసులు వివరించారు.
నిందితుడు ప్రదీప్ కారుని స్వాధీనం చేసుకున్నామని, అతడిపై మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఢిల్లీ నగరం పశ్చిమ్ విహార్‌లోని ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో కారుని ఆపి వీడియోలు షూట్ చేశాడని, డోరు తెరిచి కారు నడిపాడని పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా పోలీసు బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీశాడని వివరించారు. వాటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేశాడని వెల్లడించారు.
ప్రదీప్‌పై కేసు నమోదు చేయడానికి కారణమైన వీడియోలను ఢిల్లీ పోలీసులు షేర్ చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేశామని వివరించారు. ప్రదీప్ ఉపయోగించిన కారు అతడి తల్లి పేరు మీద రిజిస్టర్ అయినట్లు తేలిందని, కారులో కొన్ని నకిలీ ప్లాస్టిక్ ఆయుధాలను కూడా గుర్తించామని పేర్కొన్నారు.