KCR District Tour: ఎండిన పొలాలను పరిశీలించిన కేసీఆర్
- జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మాజీ సీఎం టూర్
- ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి ఉదయం బయలుదేరిన కేసీఆర్
- దారవత్ తండా మహిళా రైతుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ
సాగునీరందక జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయి గోసపడుతున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆదివారం ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్.. జనగామ జిల్లా దేవరప్పుల మండలం దారవత్ తండాకు చేరుకున్నారు. తండాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. మహిళా రైతు సత్తవ్వ సమస్యలు విన్న కేసీఆర్.. ఆమె కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లిన కేసీఆర్.. అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించారు. పంట పొలాలను, ఎండిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఎండిన పంటపొలాలను పరిశీలించి సాయంత్రం తిరిగి ఎర్రవెళ్లి ఫాంహౌస్ కు బయలుదేరుతారని పేర్కొన్నాయి.