Chandrababu: మేం వచ్చాక కొత్త జిల్లా ప్రకటిస్తాం: మార్కాపురంలో చంద్రబాబు
- ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు
- విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత ఈ సీఎంకు లేదన్న చంద్రబాబు
- హూ కిల్డ్ బాబాయ్ అంటే జగన్ కు తెలియదట అంటూ ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తాము అధికారంలోకి వచ్చాక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చామని వెల్లడించారు.
కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రామాయపట్నం పోర్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లాలో సుబాబుల్ ఎక్కువగా పండిస్తారని ఏషియన్ పల్ప్ పరిశ్రమను తెచ్చానని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏషియన్ పల్ప్ పరిశ్రమ పారిపోయిందని తెలిపారు. నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశారని మండిపడ్డారు.
ఈ ముఖ్యమంత్రికి విశ్వసనీయత ఉందా?
ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. గత ఎన్నికల ముందు ఏం చెప్పాడు?... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడా లేదా? కేంద్రం మెడలు వంచకపోగా, తానే మెడలు దించాడు. అదీ నీ విశ్వసనీయత! ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చాడా? ఎంతసేపూ నీ వ్యక్తిగత కేసులు తప్ప, రాష్ట్రాన్ని పట్టించుకుంది లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పాడు. ఇప్పుడు అడుగుతున్నా... ఇదీ నీ విశ్వసనీయత.
మద్యపానాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు... రద్దు చేశాడా అని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగా డీఎస్సీ ఇవ్వకపోడం నీ విశ్వసనీయత. మేం వచ్చాక నా మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే అని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.
హూ కిల్డ్ బాబాయ్ అంటే జగన్ కు తెలియదట!
హూ కిల్డ్ బాబాయ్ అంటే మీకందరికీ తెలుసు. కానీ జగన్ కు తెలియదంట. నిందితుడ్ని పక్కనపెట్టుకుని, బాధితులను జైలుపాలు చేయాలని చూస్తున్నాడు. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావ్ జగన్! బాబాయిని ఎవరు చంపారంటే ఇప్పటికీ చెప్పడు. మాట్లాడితే కలియుగం అంటాడు. ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగం మహిమ.
బాబాయ్ ని చంపేవాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మనకు కావాలా? కంటైనర్ లో డబ్బులు పంపించేవాళ్లు మీకు కావాలా? ప్రజాసేవ చేసి మీ జీవితాలు మార్చేవాళ్లు మీకు కావాలి. మీ తరఫున పోరాడినందుకు మా గతి ఏమైందో మీరంతా చూశారు. ఎంతమందిపై కేసులు పెట్టారో, ఎంతమందిని జైల్లో పెట్టారో మీకు తెలియదా? ఇప్పటికీ కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదు" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.