YS Sharmila: బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది... అందుకే ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగిస్తోంది: షర్మిల
- దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందన్న షర్మిల
- కాంగ్రెస్ అంటే బీజేపీకి ఎందుకంత భయం అని ప్రశ్న
- విజయవాడ ఐటీ ఆఫీసు వద్ద ధర్నాను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యలు
మనదేశంలో భారత రాజ్యాంగం నడవడంలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత భయం? బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది... అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను విపక్షాలపై ఉపయోగించి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందని షర్మిల మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నదే బీజేపీ సర్కారు కుట్ర అని ఆరోపించారు. అందుకు నిరసనగా విజయవాడ ఐటీ ఆఫీసు వద్ద ధర్నా తలపెడితే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు అని షర్మిల ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా అదానీ, అంబానీల అనుచరులకు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంది భయంతోనే అని పేర్కొన్నారు.