Kiran Kumar Reddy: చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలైంది: కిరణ్ కుమార్ రెడ్డి
- రాజంపేట లోక్ సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి
- సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిపై విమర్శలు
- పరోక్షంగా బదులిచ్చిన మిథున్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ స్థానంలో ఈసారి ఎన్నికల వేడి మామూలుగా ఉండబోదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఈసారి కూడా రాజంపేట బరి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే, మిథున్ రెడ్డికి పోటీగా కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగడంతో వాతావరణం వేడెక్కింది. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలతో మరింతగా అగ్గి రాజుకుంది.
"చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలుపెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజకీయాలను డబ్బు సంపాదన కోసమే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ పదేళ్లలో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని లూటీ చేయడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా తయారుచేశారు. ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది" అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక, కిరణ్ వ్యాఖ్యలపై ఎంపీ మిథున్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. ఒకాయన పదేళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సూట్ కేసుతో వచ్చారని విమర్శించారు. జూన్ 4 తర్వాత మళ్లీ అదే సూట్ కేసుతో హైదరాబాద్ తిరిగి వెళ్లేలా ప్రజలు తీర్పు ఇస్తారని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
మదనపల్లె, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని మిథున్ రెడ్డి అన్నారు.