Narendra Modi: ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Electoral bonds issue no setback shortcomings can be improved PM Modi
  • ఎన్నికల బాండ్ల రద్దు తమకు ఎదురుదెబ్బ కాదన్న ప్రధాని మోదీ
  • బాండ్ల రద్దు చూసి సంతోషిస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందుతారని వ్యాఖ్య
  • ఎన్నికల బాండ్ల వల్లనే దర్యాప్తు ఏజెన్సీలు నిధుల మూలాల్ని సులభంగా గుర్తించగలిగాయని వెల్లడి
  • 2014కు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని వ్యాఖ్య
  • ఆదివారం తంతి టీవీకి మోదీ ఇంటర్వ్యూ
ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి ఎదురుదెబ్బగా తాము భావించట్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఉండదని ఆయన చెప్పారు. లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘అసలేం జరిగిందని మేము దీన్ని ఎదురుదెబ్బగా భావించాలో చెప్పండి? ఎలక్బోరల్ బాండ్‌ల రద్దు చూసి సంబరపడుతూ చిందులేస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అసలు ఈ రోజు నిధుల రాకడ గురించి ఇంత సులభంగా తెలిసిందంటే అది ఎన్నికల బాండ్ల వల్లే. 2014కు ముందు ఏ దర్యాప్తు ఏజెన్సీ అయినా ఈ వివరాలను సేకరించగలిగేదా? లోపాలే లేని వ్యవస్థ ఉండదు. అయితే, ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి’’ అని మోదీ అన్నారు. 

కాగా, తాను చేసే ప్రతిపనిలోనూ రాజకీయం చూడొద్దని ప్రధాని మోదీ అన్నారు. తాను దేశం కోసం పనిచేస్తానని, తనకున్న అతిపెద్ద బలం తమిళనాడేనని కూడా వ్యాఖ్యానించారు. ఓట్లే తన ప్రాధాన్యత అయ్యి ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇంత చేసి ఉండేవారం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు ఆ ప్రాంతాన్ని దాదాపు 150 సార్లు సందర్శించారని, గత ప్రధానులకంటే ఎక్కువగా తాను మూడు సార్లు ఈశాన్య రాష్ట్రాల పర్యటన చేపట్టానని మోదీ తెలిపారు. ‘‘నేను రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన నాకు ఎన్నికల్లో గెలుపే పరమావధి కాదు’’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు ఎంతో సామర్థ్యం ఉందని, అది వృథాకాకూడదని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లల్లో తన కృషిని ప్రజలు చూశారని, తమిళనాడులో ఈసారి బీజేపీ-ఎన్డీఏయేనే వారు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. 

తమిళభాషను రాజకీయం చేయడంపై కూడా ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ తీరు తమిళనాడుకే కాకుండా యావత్ దేశానికి నష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. తమళభాషను ప్రోత్సహించాలని వ్యాఖ్యానించారు.
Narendra Modi
Electoral Bonds
Tamilnadu
BJP

More Telugu News