EPFO New Rule: ఉద్యోగం మారినా పీఎఫ్ గురించి టెన్షన్ అక్కర్లేదిక.. ఈపీఎఫ్ వో కొత్త రూల్
- నేటి నుంచి అమలులోకి వచ్చిన ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్ ఫర్
- పాత ఖాతాలోని సొమ్ము మొత్తం కొత్త ఖాతాలోకి బదిలీ
- ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే పనిలేకుండా మార్పులు చేసిన ప్రభుత్వం
కొత్త అవకాశాలు, మెరుగైన వేతనం కోసం ఉద్యోగం మారిన వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లింక్ చేయడం.. ఇప్పటి వరకు దీనికోసం కొత్త సంస్థ నుంచి మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ దరఖాస్తు ప్రక్రియ తప్పనిసరిగా చేయాల్సిందే. లేదంటే పీఎఫ్ ఖాతా సీనియారిటీ లెక్కలోకి రాదు. దీంతో ఉద్యోగస్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందలేరు. అయితే, ఇకపై ఈ ఇబ్బంది ఉండదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) కొత్త రూల్ ‘ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్ సిస్టం’ ను తీసుకొచ్చింది.
ఈ నెల 1 (ఈరోజు) నుంచే అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్ గా విలీనం అవుతాయి. పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి. దీంతో పీఎఫ్ ఖాతాలో సీనియారిటీ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉద్యోగికి ఉండదు. సాధారణంగా పీఎఫ్ ఖాతాలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నపుడు కొంత మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల సర్వీసు దాటిన ఖాతాల నుంచి సొమ్ము తీసుకున్నప్పుడు ఈ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా అమలులోకి వచ్చిన రూల్ తో ఉద్యోగం మారినా పీఎఫ్ ఖాతా సీనియారిటీ విషయంలో మార్పుండదు కాబట్టి ఈ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది.