Nara Lokesh: సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే: నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
- సేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదన్న లోకేశ్
- మంగళగిరిలో ఐదేళ్లుగా తాను చేస్తున్న పనులను వివరించిన లోకేశ్
- కరకట్ట కమలహాసన్ అంటూ ఆర్కేపై విమర్శలు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే అని చురక అంటించారు. ప్రజా సేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు... పది మందికీ సాయపడాలన్న మనసు కూడా ఉండాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఓ దివ్యాంగుడిని కలిసినప్పటి ఫొటోలను లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొన్ని నెలల క్రితం తోపుడు బండి ఇచ్చాను. ఇలాంటి వేలాది మందికి నేను గత ఐదేళ్లుగా చేయూతనిచ్చాను. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటు చేశా. 29 సంక్షేమ పథకాలను ఐదేళ్లుగా సొంత నిధులతో అమలు చేస్తున్నా.
పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే... నేను చేసిన పనుల్లో పదోవంతైనా చేశారా? మీరు చేసింది ఏమిటంటే... ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారు. సేవ చేయడం అంటే... కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న పేదల గూళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్!" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.