Chandrababu: పేదలకు పింఛన్లు ఇప్పించే వరకు టీడీపీ నేతలు వదలొద్దు: చంద్రబాబు

Chandrababu directs TDP cadre on pensions and volunteers
  • పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఈసీ
  • టీడీపీ పేదలకు పెన్షన్లు అందకుండా చేసిందన్న వైసీపీ
  • వైసీపీ కుట్ర పూరితంగానే పెన్షన్లు ఆలస్యం చేస్తోందంటున్న టీడీపీ
  • జగన్ తన స్వార్థ్యంతో పింఛనుదారుల పొట్టకొట్టాడన్న చంద్రబాబు
ఎన్నికల కోడ్ ప్రభావంతో ఏపీలో పెన్షన్ల అందజేత ఆలస్యం అయింది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణం.

పేదలకు పెన్షన్లు అందకుండా చేసింది టీడీపీ నేతలే అని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఈసీ ఆదేశాల గురించి తెలిసి కూడా పెన్షన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వైసీపీ కావాలనే ఆలస్యం చేస్తోందని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు ఈ మధ్యాహ్నం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తన రాజకీయ స్వార్థం కోసం జగన్ పింఛన్ లబ్ధిదారుల పొట్టకొట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4 వేల పెన్షన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ రెండు నెలలు ఎవరికైనా పెన్షన్ అందకపోతే, తాము వచ్చాక అది కూడా కలిపి ఇస్తామని స్పష్టం చేశారు. 

అధికారం నుంచి దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పింఛన్లు ఇప్పించేంత వరకు టీడీపీ నేతలు వదలొద్దని చంద్రబాబు కర్తవ్య బోధ చేశారు. జిల్లా కలెక్టర్లను కలిసి పెన్షన్ ఇళ్ల వద్దే అందేలా చూడాలని సూచించారు. 

టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా వాలంటీర్లను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తటస్థంగా పనిచేసే వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాలంటీర్లకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

ప్రజాక్షేత్రంలో జగన్ ను దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా జగన్ కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. గత 15 రోజుల్లో ఎవరికెంత బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Pension
Volunteers
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News