Volunteers: వాలంటీర్ల సంచలన నిర్ణయం... సామూహిక రాజీనామాలు
- ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న వాలంటీర్ల అంశం
- వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఈసీ
- వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
- మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు
ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. ఇది ఎన్నికలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో అధికార, విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ప్రాంతంలో వందలాది వాలంటీర్లు తమ రాజీనామాలను మునిసిపల్ కమిషనర్ కు సమర్పించారు. వాలంటీర్లు సామూహికంగా తరలిరావడంతో మచిలీపట్నం మున్సిపల్ కమిషనరేట్ లో భారీ కోలాహలం నెలకొంది. తమ సేవలకు రాజకీయాలు ఆపాదిస్తూ కొందరు ఈసీకి ఫిర్యాదు చేయడంతో తాము రాజీనామా చేస్తున్నట్టు వాలంటీర్లు పేర్కొన్నారు.
పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. భీమవరం ప్రాంతంలోనూ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది.