Yashasini Reddy: కేసీఆర్ మొదట జైల్లో ఉన్న కవితను పరామర్శించడానికి వెళ్లాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
- ఒకరి అర ఎకరం పొలానికి గ్రౌండ్ వాటర్ లేక ఎండిపోయిందన్న యశస్విని రెడ్డి
- బీఆర్ఎస్ నాయకులు పదేపదే అదే పొలాన్ని సందర్శిస్తూ టూరిస్ట్ స్పాట్‌గా మార్చారని ఎద్దేవా
- ఆ పొలాన్ని ఎర్రబెల్లి దయాకరరావు, హరీశ్ రావు, కేసీఆర్‌లు పదిరోజుల వ్యవధిలో సందర్శించారన్న ఎమ్మెల్యే
- కేసీఆర్, మాజీ మంత్రులు జైలుకు వెళతారని జోస్యం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలుత మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న తన కూతురు కవితను పరామర్శించేందుకు వెళ్లాలని కాంగ్రెస్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎద్దేవా చేశారు. దేవరప్పుల మండలం ధారావత్ తండాలో నిన్న కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించి... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో యశస్వినిరెడ్డి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేదన్నారు. ఒకరి అర ఎకరం పొలానికి గ్రౌండ్ వాటర్ లేక ఎండిపోయిందని... బీఆర్ఎస్ నాయకులు పదేపదే ఆ ఒక్క పొలాన్ని సందర్శిస్తూ టూరిస్ట్ స్పాట్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. అదే పొలాన్ని ఎర్రబెల్లి దయాకరరావు, హరీశ్ రావు, కేసీఆర్‌లు పదిరోజుల వ్యవధిలో సందర్శించారని విమర్శించారు.
కేసీఆర్ పరిశీలించిన పొలంలో వరుసగా నాలుగుసార్లు బోర్లు వేసినా నీళ్లు రాలేదని వెల్లడించారు. కానీ పక్కనే ఉన్న మరో రైతు పొలంలో నీళ్లు వస్తున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న కేసీఆర్ ఇప్పుడు పొలంబాట పట్టడం విడ్డూరమన్నారు. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, మాజీ మంత్రులు జైలుకు వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఆ ఒత్తిడిలోనే రైతులను అడ్డు పెట్టుకొని రాజకీయ షోలు చేస్తున్నారని విమర్శించారు.