Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
- ప్రభాకరరావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడి
- దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి రూ.1 కోటి సీజ్ చేశామని అంగీకారం
- కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ పోలీసధికారి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి రూ.1 కోటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్ రావును ఈ కేసులో ఏ4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి రూ.1 కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.