Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలున్నాయి... ఏదో ఒక ఊర్లో ఇల్లు తీసుకుంటాను: పవన్ కల్యాణ్
- ఇవాళ జనసేన పార్టీలో ప్రముఖ నేతల చేరికలు
- జనసేన కండువా కప్పుకున్న మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
- జనసేన పార్టీని అర్థం చేసుకుని వచ్చిన వారికి స్వాగతం అంటూ పవన్ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఇవాళ మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, వివిధ రంగాలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేనను అర్థం చేసుకుని ఇవాళ పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలు, న్యాయవాదులు, మేధావులు, విభిన్న వర్గాల ప్రజలకు స్వాగతం పలుకుతున్నానని తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురంను తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక ఊరిలో ఇల్లు తీసుకుంటానని వెల్లడించారు. పగిలేకొద్దీ పదునెక్కేది గ్లాసు... గ్లాసు గుర్తుకు ఓటేయండి, జనసేనను గెలిపించండి అని పిలుపునిచ్చారు. వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ... గాలి తక్కువ... అది ఓడిపోయే పార్టీ అని అన్నారు.