GST collections: మార్చిలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు
- 11.5 శాతం వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లుగా నమోదు
- జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టాక రెండవ అత్యధిక స్థాయి ఆదాయం
- గణాంకాలు వెల్లడించిన ఆర్థిక మంత్రిత్వశాఖ
గత నెల మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వసూలైంది. ఏడాది ప్రాతిపదికన 11.5 శాతం వృద్ధి నమోదయిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇదే రెండవ అత్యధిక స్థాయి వసూలు అని తెలిపింది. దేశీయంగా వ్యాపార, వాణిజ్య లావాదేవీలు 17.6 శాతం మేర పెరగడం ఈ స్థాయి వసూళ్లకు దోహదపడిందని పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థలో దృఢమైన ఆదాయానికి ఈ వసూళ్లే ప్రతిబింబమని వ్యాఖ్యానించింది.
ఇక సంవత్సరం ఏప్రిల్ 2023-మార్చి 2024 కాలంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.20.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయని పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 11.7 శాతం ఎక్కువని తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2024లో నెల సగటు స్థూల వసూళ్లు రూ. 1.68 లక్షల కోట్లుగా ఉన్నాయని, అంతకుముందు సంవత్సరం ఇది రూ.1.5 లక్షల కోట్లుగా ఉందని ప్రస్తావించింది. కాగా ఏప్రిల్ 2023లో అత్యధికంగా రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వసూలైన విషయం తెలిసిందే.