IPL 2024: హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేసిన అభిమానులు.. రోహిత్ చేసిన పనికి నెటిజన్ల ఫిదా.. నెట్టింట వీడియో వైరల్!
- సొంతమైదానం వాంఖడేలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం
- రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్‌ను ఆపమన్న హిట్‌మ్యాన్
- కెప్టెన్‌కు మద్దతుగా నిలిచిన రోహిత్ శర్మపై నెటిజన్ల ప్రశంసలు
- నిన్నటి మ్యాచ్‌లోనూ ముంబై ఓటమి
- ఈ ఐపీఎల్ సీజన్లో ఎంఐకి ఇది వరుసగా మూడో పరాజయం
కెప్టెన్‌గా తొలిసారి హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియానికి చేరుకున్న హార్దిక్ పాండ్యాకు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ అభిమానులు హార్దిక్‌ను ఎగతాళి చేస్తూ అరవడం ప్రారంభించారు. మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో, ఆ తర్వాత పాండ్యా వద్దకు బాల్ వెళ్లిన ప్రతిసారి ముంబై సారధిని ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. దీంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆపమంటూ సైగ చేశారు. దీంతో కెప్టెన్‌కు మద్దతుగా నిలిచిన హిట్‌మ్యాన్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, గత రెండు మ్యాచుల్లోనూ స్టేడియంలో హార్దిక్ పాండ్యాకు అభిమానుల నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే.
ఇక వాంఖడే స్టేడియం వేదికగా నిన్న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్లో ఎంఐకి ఇది వరుసగా మూడో పరాజయం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ ఘోరంగా విఫలమైంది. 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకే పరిమితమైంది. ఇక ముంబై నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, బ్యాటింగ్‌లో యువ ఆటగాడు రియాన్ పరాగ్ రాణించడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో ఎంఐ వరుసగా మూడవ ఓటమిని చవిచూసింది. అటు రాజస్థాన్ జట్టు వరుసగా మూడో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మరోసారి నెట్టింట చర్చ
ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ ముంబై జట్టును పరాజయాలే పలకరించాయి. గుజరాత్ సారధిగా తొలి మూడు మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న హార్దిక్.. ఎంఐ కెప్టెన్‌గా మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ఆల్‌రౌండర్ ఫెయిల్ అవడం, ఆటగాళ్ల మధ్య సమన్వయం కల్పించడంలో విఫలమవ్వడం వంటివి ముంబై ఓటములకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.