Patricia Eriksson: జన్మనిచ్చిన తల్లిని కనుగొనేందుకు ఖండాంతరాలు దాటి భారత్ వచ్చిన స్వీడన్ మహిళ
- 1983లో నాగ్ పూర్ లో ఓ ఆసుపత్రిలో జన్మించిన ఆడశిశువు
- బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిపోయిన యువతి
- శిశువును దత్తత తీసుకున్న స్వీడన్ దంపతులు
ఇది అచ్చం ఓ సినిమాను తలపిస్తుంది. తనకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలుసుకునేందుకు ఓ స్వీడన్ మహిళ ఖండాంతరాలు దాటి భారత్ వచ్చింది. ఆమె పేరు ప్యాట్రీషియా ఎరిక్సన్. 41 ఏళ్ల ప్యాట్రీషియా కథ ఆసక్తికరంగా ఉంటుంది.
ఆమె 1983లో మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించింది. పెళ్లి కాకుండానే తల్లయిన 23 ఏళ్ల యువతి నాగపూర్ లోని దాగా హాస్పిటల్ లో ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ యువతి తన బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో, ఆసుపత్రి వర్గాలు ఆ శిశువును ఓ అనాథ శరణాలయానికి అప్పగించారు.
ఆ మరుసటి ఏడాది భారత్ సందర్శనకు వచ్చిన ఓ స్వీడన్ దంపతులు... నాగపూర్ లోని అనాథ శరణాలయం నుంచి ఆ చిన్నారిని దత్తత తీసుకున్నారు. అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి, వారు ఆ బిడ్డను తమతో పాటు స్వీడన్ తీసుకెళ్లి ప్యాట్రీషియా ఎరిక్సన్ అని నామకరణం చేసి పెంచుకున్నారు.
స్వీడన్ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన ఉమియా నగరంలో పెరిగిపెద్దదైన ప్యాట్రీషియాకు తన తల్లి ఎవరో తెలుసుకోవాలన్న బలమైన కోరిక కలిగింది. ఆమె దత్త తల్లిదండ్రులు కూడా దత్తత పత్రాలు అందించి ఆమెకు సహకారం అందించారు.
భారత్ వచ్చిన ప్యాట్రీషియా... అంజలి పవార్ అనే మహిళ సాయంతో తల్లి కోసం అన్వేషణ సాగించింది. ఎన్ని ఆసుపత్రుల్లో వాకబు చేసినా, మాకు తెలియదు అనే సమాధానమే వినిపించింది.
ప్యాట్రీషియా ఇప్పటికి రెండు పర్యాయాలు భారత్ వచ్చిన తల్లి కోసం అన్వేషణ సాగించింది. జన్మనిచ్చిన తల్లికి చెందిన వివరాలు కొంచెం కూడా లభ్యం కాకపోయినప్పటికీ, తనలో పట్టుదల మరింత పెరిగిందని ప్యాట్రీషియా చెబుతోంది. తన తల్లి కనిపిస్తే ఒక్కసారి ఆమెను మనసారా హత్తుకోవాలనుందని పేర్కొంది.