Ayushmann Khurrana: బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానాను 'యూత్ ఐకాన్'గా నియమించిన ఈసీ

Ayushmann Khurrana appointed as youth icon by Election Commission of India

  • ఆయుష్మాన్ ఖురానా నియామ‌కంపై మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త ఎన్నిక‌ల సంఘం
  • ఈ నేప‌థ్యంలో త‌న‌ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్‌' ఖాతాల‌లో ప్ర‌త్యేక‌ వీడియోను పోస్ట్ చేసిన ఈసీ
  • ఈ వీడియోలో బాలీవుడ్ న‌టుడు దేశ ప్రజలకు ఓటు హ‌క్కు విష‌య‌మై విజ్ఞప్తి చేస్తూ క‌నిపించిన వైనం

బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానాకు భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించింది. యువ ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు ఆయ‌న‌ను 'యూత్ ఐకాన్'గా ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అలాగే ఈసీ తమ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్‌' ఖాతాల‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ కనిపించారు.

దేశ‌ ప్ర‌జ‌ల‌కు ఆయుష్మాన్ ఖురానా ప్ర‌త్యేక‌ విజ్ఞప్తి..
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ఎన్నికల క‌మిష‌న్ ప్ర‌తియేటా కొంతమంది సినీ నటులకు యూత్‌ ఐకాన్‌గా బాధ్యతను అప్పగిస్తుంది. ఈసారి ఆయుష్మాన్ ఖురానాకు ఈ పెద్ద అవకాశం దక్కింది. దీనిలో భాగంగా మంగళవారం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో అత‌డు ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రోజు, తేదీలను బట్టి కచ్చితంగా ఒక్కరోజు మీ వంతు వ‌చ్చిన‌ప్పుడు ఓటు వేయాలని కోరారు. 

ఈ సంద‌ర్భంగా లోక్‌సభ ఎన్నికలు ఒక పండుగ అని, మనం అందరం మన విలువైన ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగ‌ను ఘ‌నంగా జరుపుకోవాలని వీడియో ద్వారా ఆయుష్మాన్ ఖురానా దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇక ఆయుష్మాన్‌కు ఈ కీల‌క బాధ్య‌త ద‌క్క‌డంలో ఆయ‌న ప‌లు చిత్రాల్లో పోషించిన‌ సోష‌ల్ మెసేజ్‌ల‌తో కూడిన పాత్ర‌లు కూడా కార‌ణం అని చెప్పాలి. కాగా, ఇంతకుముందు మ‌రో బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌రావును కూడా భారత ఎన్నికల సంఘం నేషనల్ యూత్ ఐకాన్‌గా నియ‌మించిన సంగతి తెలిసిందే. 

ఆయుష్మాన్ ఖురానా సినిమాల విష‌యానికి వ‌స్తే..
ఆయుష్మాన్ ఖురానా చివరిగా 'డ్రీమ్ గాళ్‌-2' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇందులో ఆయ‌న‌కు జోడీగా అనన్య పాండే నటించారు. ఆ తర్వాత కొద్ది నెలలుగా సినీ ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఆయుష్మాన్ తదుపరి చిత్రంపై ఇంకా ఎలాంటి స‌మాచారం లేదు. అయితే, 2018 సూపర్ హిట్ చిత్రం 'బధాయీ హో' చిత్రం సీక్వెల్‌లో నటించేందుకు ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News