Jawharlal Nehru: మొదట చైనా.. తరువాత ఇండియా అని నెహ్రూ అన్నారు: మంత్రి జైశంకర్

There was a time when Nehru said India second China first S Jaishankar
  • గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో మంత్రి జైశంకర్
  • నెహ్రూ పొరపాట్ల కారణంగానే చైనా, పాక్‌తో సమస్యలు ఉత్పన్నమయ్యాయని వ్యాఖ్య
  • నెహ్రూ ఒకప్పుడు చైనాకే తొలి ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడి
  • ప్రస్తుతం భారత్ తన సొంత అవసరాలకే ప్రాధాన్యం ఇస్తోందని ప్రకటన
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒకప్పుడు చేసిన పొరపాట్లే నేడు పీఓకే, చైనా రూపంలో భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చైనా, పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో భారత్‌ వైఖరిపై ఆయన ప్రసంగించారు. 

‘‘1950ల్లో సర్దార్ పటేల్ నెహ్రూను చైనా విషయంలో హెచ్చరించారు. చరిత్రలో తొలిసారిగా భారత్ రెండు వైపుల నుంచి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని చెప్పారు. చైనా తీరు అనుమానాస్పదంగా ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కానీ, పటేల్ అనవసరంగా చైనాను సందేహిస్తున్నారని నెహ్రూ జవాబిచ్చారు. హిమాలయాలకు ఆవల నుంచి భారత్‌పై దాడి చేయడం అసాధ్యమని అన్నారు. చైనాతో ప్రమాదమన్న వాదననే కొట్టిపారేశారు’’

‘‘అంతేకాదు, ఐక్యరాజ్యసమితిలో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై చర్చ సందర్భంగా నెహ్రూ చైనాకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చాక భారత్‌కు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మనం మన అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. కానీ, ఒకప్పుడు చైనా ముందు, ఆ తరువాత భారత్ అని నెహ్రూ అన్నారు’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 

కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకెళ్లడం సర్దార్ పటేల్‌కు ఇష్టం లేదని మంత్రి జైశంకర్ తెలిపారు. అక్కడి న్యాయమూర్తి ఆలోచనా ధోరణిపై పటేల్‌కు సందేహాలు ఉండేవన్నారు. ‘‘ఓ న్యాయమూర్తికి పక్షపాత ధోరణి ఉంటే ఆయన నుంచి న్యాయం ఆశించం కదా? కానీ వాస్తవంలో అదే జరిగింది. కశ్మీర్ అంశం చివరకు ఐక్యరాజ్య సమితికి చేరింది. పీఓకేపై సైనిక దాడి ఆపాలంటూ భారత్‌పై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. గతంలో జరిగిన పొరపాట్ల కారణంగానే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుతం కొందరు సరిహద్దుల గురించి మాట్లాడుతూ వాటిని తిరగరాయాలని అంటారు. కానీ మన సరిహద్దులు ఎప్పుడో నిర్ణయమైపోయాయి. ఇప్పుడు మనం వాటిని సందేహించకూడదు’’ అని మంత్రి జైశంకర్ అన్నారు.
Jawharlal Nehru
Subrahmanyam Jaishankar
Congress
BJP
China
Pakistan

More Telugu News