Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి మృత్యువాత!
- ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఘటన
- టైలరింగ్ షాపులో ఉన్నట్టుండి చెలరేగిన మంటలు
- దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక భారీ ప్రాణనష్టం
మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. స్థానికంగా ఉండే ఓ టైలరింగ్ షాపులో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన పొగ ఏర్పడి ఊపిరాడక ఏడు మంది చనిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దన బజార్‌లోని ఓ టైలరింగ్ షాపులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. సదరు షాపు భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండడంతో పై అంతస్తుల్లో ఉండే వారికి దట్టమైన పొగ కమ్మేసింది. దాంతో ఊపిరాడకపోవడంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
"టైలర్ షాపులో ఉదయం 4 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై 4.15 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే భారీగా మంటలు వ్యాపించాయి. అలాగే షాపు పై అంతస్తులో ఉండే ఓ ఫ్యామిలీలోని ఏడుగురు దట్టమైన పొగల కారణంగా ఊపిరాడకపోవడంతో చనిపోయారు" అని పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా మీడియాకు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు.