indian origin: మందులు వాడకుండానే డయాబెటీస్ ను రివర్స్ చేసుకున్న భారత సంతతి సీఎఫ్ వో
- 2015లో 51 ఏళ్ల వయసులో టైప్2 డయాబెటీస్ బారినపడ్డ రవిచంద్ర
- మందులు వాడడం ఇష్టంలేక పరుగు మొదలెట్టానని వెల్లడి
- నిత్యం రన్నింగ్ తో షుగర్ కు చెక్ పెట్టానంటున్న రవిచంద్ర
- పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు కూడా రన్నింగ్ మంచిదని వ్యాఖ్య
డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి ఒకసారి ఎటాక్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటుంటారు. షుగర్ ను అదుపులో ఉంచుకోవడమే తప్ప రివర్స్ చేయడం సాధ్యం కాదని భావిస్తుంటారు. కానీ హాంకాంగ్ లో ఉంటున్న ఓ భారత సంతతి సీఎఫ్ వో మాత్రం డయాబెటీస్ ను రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించి డాక్టర్లు సహా అందరినీ ఆశ్చర్యపరిచాడు..
మందులను నిరాకరించి..
అమోలీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనే కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ వో)గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి రవిచంద్ర తాను డయాబెటీస్ ను ఎలాంటి మందులు వాడకుండానే రివర్స్ చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. రవిచంద్ర 2015లో 51 ఏళ్ల వయసులో టైప్2 డయాబెటీస్ బారిన పడ్డాడు. దీంతో డాక్టర్ ను సంప్రదించగా వెంటనే మందులు వాడాలని సూచించాడు. కానీ అందుకు రవిచంద్ర మనసు అంగీకరించలేదు. మందులు వాడకుండానే దానిని తగ్గించుకోవాలనుకున్నాడు.
రోజూ పరుగు ప్రారంభించి..
మందుల బదులు సహజంగానే బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుకోవాలని భావించిన రవిచంద్ర అందుకు రన్నింగే ఉత్తమమైనదని భావించాడు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పరుగు ప్రారంభించాడు. ఇలా 3 నెలలపాటు నిత్యం రన్నింగ్ చేసిన అనంతరం బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను పరీక్షించుకోగా తిరిగి సాధారణ స్థాయికి వచ్చేసినట్లు రవిచంద్ర తెలిపాడు.
మారథాన్లతో మారిన సీన్..
షుగర్ బారిన పడ్డట్లు తెలియగానే రవిచంద్ర వివిధ మారథాన్ లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 రేసుల్లో పాల్గొన్నాడు. అందులో హాంకాంగ్, చైనా, తైవాన్, ఇండియాలో జరిగిన 12 మారథాన్ లు, 5 హాఫ్ మారథాన్ లు, 10 కిలోమీటర్ల పరుగు పందేలు 7, 5 ఆల్ట్రా రన్స్ తోపాటు హాంకాంగ్ లో జరిగిన 100 కిలోమీటర్ల ఆక్స్ఫాం ట్రెయిల్ వాకర్ కూడా ఉంది. కేవలం 3 నెలలపాటు రెగ్యులర్ గా రన్నింగ్ చేశాక రవిచంద్ర బ్లడ్ గ్లూకోజ్ ను చెక్ చేసుకోగా 8 నుంచి 6.80 స్థాయికి తగ్గింది.
మందులు మొదలుపెడితే డోస్ పెరుగుతూనే ఉంటుంది..
తన పరిస్థితి గురించి రవిచంద్ర వివరిస్తూ “ఒకసారి నేను మందులు వేసుకోవడం మొదలుపెడితే ఇక వాటి డోస్ పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దాని బదులు ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవడం ద్వారా డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచాలని అనుకున్నా. దానికితోడు పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజే పరిష్కారమని అనిపించింది” అని చెప్పాడు.
2011లో మారథాన్ మొదలుపెట్టినా..
సుమారు 100 మారథాన్ లు పరుగెత్తిన తన స్నేహితుడి స్ఫూర్తితో రవిచంద్ర 2011లో మారథాన్ లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అయితే ఓ సంఘటనతో పరుగును ఆపేశాడు. చివరకు డయాబెటీస్ బారిన పడ్డాక మళ్లీ పరుగు మొదలుపెట్టాడు. అయితే ఈసారి రన్నింగ్ కోసం తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. “నేను ముందుగా ఒక కిలోమీటరు వాకింగ్ తో మొదలుపెట్టా. ఆ తర్వాత కాసేపు పరుగెత్తడం, మళ్లీ కాసేపు నడవడం ఇలా 10 కిలోమీటర్లు చేసేవాడిని. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు ఏకధాటిగా 10 కిలోమీటర్ల చొప్పున రన్నింగ్ చేసేవాడిని. ఇప్పుడు వారంలో 6 రోజులపాటు 8 నుంచి 9 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నా. ఇలా ఇప్పటివరకు సుమారు 20 వేల కిలోమీటర్లు రన్నింగ్ చేశా” అని రవిచంద్ర చెప్పాడు.
ఇడ్లీ, దోశ తింటా..
తాను ఎక్కువగా వెజిటేరియన్ ఆహారాన్నే తీసుకుంటానని రవిచంద్ర చెప్పాడు. అప్పుడప్పుడూ మాత్రం చేపలు లేదా చికెన్ తింటానన్నాడు. రోజూ బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ లేదా దోశ, కర్డ్ రైస్ తింటానని అన్నాడు. అలాగే లంచ్, డిన్నర్లోనూ రైస్ నే ఎక్కువగా తీసుకుంటానని చెప్పాడు. అలాగే స్నాక్స్ కింద రోజూ యాపిల్స్ లేదా బత్తాయిలు తీసుకుంటానని అన్నాడు రవిచంద్ర.