Rahul Gandhi: కేరళలోని వాయనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
- 2019లో వాయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ
- భారీ ఊరేగింపుతో నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన రాహుల్
- రాహుల్ వెంట సోదరి ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఇవాళ ఆయన వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
నామినేషన్ వేసే ముందు జన సందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వాయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని రాహుల్ అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు.