UK: రూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’ను కొట్టేసిన దొంగ
- 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ ప్యాలెస్ నుంచి దొంగిలింత
- నేరాన్ని అంగీకరించిన నిందితుడు జేమ్స్ షీన్
- యూకేలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ భారీ ఖరీదైన ‘బంగారు టాయిలెట్ కమోడ్’ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొంగిలించాడు. ఈ కమోడ్ విలువ 48,00000 పౌండ్లు (సుమారు రూ. 50.36 కోట్లు) ఉంటుందని అంచనాగా ఉంది. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. సెప్టెంబర్ 2019లో ప్యాలెస్‌లో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో దీనిని కొట్టేసినట్టు తెలిపాడు. అతడు దొంగిలించిన వస్తువుల సేకరణ, విక్రయం చేస్తుంటాడని తేలింది.
ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు హాల్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు దానిని కొట్టేశానని అతడు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం 17 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న అతడు గతంలో చాలా దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి 400,000 పౌండ్ల విలువైన ట్రాక్టర్లు, పలు ట్రోఫీలను కొట్టేశాడు.
కాగా విలాసవంతమైన ఈ కమోడ్ పేరు 'అమెరికా' అని ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరిజియో కాటెలన్ దీనిని తయారు చేశారని వివరించింది. ఇక ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో యూకే మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ జన్మించారు.