KTR: రాముడిని మొక్కుదాం... బీజేపీని తొక్కుదాం: కేటీఆర్

KTR says will pray Lord Rama but dont vote bjp

  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలపై కేటీఆర్ ఆగ్రహం
  • రంజిత్ రెడ్డి ఇంటికి వ‌స్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బ‌రాబ‌ర్ ఓడగొడుతామ‌ని చెప్పండని సూచన
  • బీజేపీకి అభ్యర్థులు లేక మన నాయకులను తీసుకొని పోటీ చేయిస్తున్నారన్న కేటీఆర్
  • ఓటు వేసే ముందు బీజేపీకి ఎందుకు వేయాలో ఆలోచించండని సూచన

రాముడిని మొక్కుదాం... బీజేపీని పండబెట్టి తొక్కుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొండా విశ్వేశ్వర్ రెడ్డి విశ్వాసం లేని నాయకుడని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఒక రన్నింగ్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పట్నం మహేందర్ రెడ్డికి, రంజిత్ రెడ్డిలకు నటనలో అవార్డు ఇవ్వాలని చురక అంటించారు. మహేందర్ రెడ్డిని మంత్రిగా చేస్తే కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తమకు మోదీ, రేవంత్ రెడ్డి దొరికారని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సంబరపడిపోతున్నారన్నారు. కానీ వారికి దిక్కులేని నాడు బీఆర్ఎస్ కార్యకర్తలే వారిని గెలిపించిన విషయం మరిచిపోయారన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు గెలిపించిన వారిని వదిలేసి ఇతర పార్టీలకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఎందుకు మారా‌వు? అని సోష‌ల్ మీడియాలో రంజిత్ రెడ్డిని పిల్ల‌లు ప్రశ్నిస్తున్నారన్నారు. రాజ‌కీయాల్లో ఓడినంత మాత్రాన పార్టీ నుంచి వెళ్లిపోతామా? మ‌న పార్టీ అధికారంలోకి వ‌స్తే ఇవాళ కాంగ్రెస్‌లోకి వెళ్లేవాడా? అవ‌కాశం, స్వార్థ్యం కోసం కాంగ్రెస్‌లో చేరాడన్నారు. ఇలాంటి అవకాశవాదిని ఓడించాలన్నారు. రంజిత్ రెడ్డి ఇంటికి వ‌స్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బ‌రాబ‌ర్ ఓడగొడుతామ‌ని చెప్పండని కార్యకర్తలకు సూచించారు. రాజ‌కీయ జీవితం ఇచ్చిన కేసీఆర్‌పై ఆయ‌న‌కు ప్రేమ లేన‌ప్పుడు.. మ‌నం ఎందుకు ప్రేమ చూపించాలని నిలదీశారు. రంజిత్ రెడ్డి సెంటిమెంట్ల‌కు పడిపోవద్దని... దొంగ‌ల పార్టీలో క‌లిసిపోయావని ముఖం మీదే చెప్పాలని సూచించారు.

ఒక్క మెడికల్ కాలేజీ, సైనిక్ స్కూల్ ఇవ్వని బీజేపీకి మనం ఓటు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ‌లో బీజేపీకి అభ్య‌ర్థులు కరవయ్యారన్నారు. చేవెళ్ల‌, మ‌ల్కాజ్‌గిరి, నల్గొండ, వ‌రంగ‌ల్‌లో మన పార్టీకి చెందిన వారినే బీజేపీ నాయ‌కులు అభ్య‌ర్థులుగా ప్రకటించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లో కిష‌న్ రెడ్డి ఒక్క‌రే ఒరిజిన‌ల్ బీజేపీ... కాబ‌ట్టి మ‌న నేత‌ల‌తోనే మ‌న‌కు పోటీ నెలకొందన్నారు. బీజేపీకి అభ్య‌ర్థులు లేరు.. కేడ‌ర్ దిక్కు లేదన్నారు. దేశంలో మోదీ హ‌వా అంత బాగుంటే.. ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. చిన్న కార్య‌క‌ర్త‌ను పెట్టినా గెల‌వాలి క‌దా? అని ప్రశ్నించారు.

మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోదీకి ఓటు వేద్దాం అని అంటున్నారు. హిందువులం కాబ‌ట్టి త‌ప్ప‌కుండా రాముడికి దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్ల‌కు బీజేపీ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. రైల్వే లైన్ ప్ర‌క‌టించారా? ఒక‌ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. ఐటీఐఆర్‌ను ర‌ద్దు చేసి పిల్ల‌ల నోట్లో మ‌ట్టి కొట్టినందుకు మోదీకి ఓటు వేయాల్నా? అన్నారు. పదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. అన్ని ధరలు పెంచినందుకు మోదీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మోదీ ప్రియ‌మైన ప్ర‌ధాని కాదు.. పిర‌మైన ప్ర‌ధాని అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News