Mehbooba Mufti: కశ్మీర్‌లో ఇండియా కూటమికి షాకిచ్చిన మెహబూబా ముఫ్తీ
- కశ్మీర్‌లో పోటీ చేయడం తప్ప తమకు మరో మార్గం లేదన్న ముఫ్తీ
- నేషనల్ కాన్ఫరెన్స్ తమను విడిచిపెట్టిందని వ్యాఖ్య
- కూటమి సీట్ల పంపిణీలో భాగంగానే పోటీ చేస్తున్నామన్న ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్‌కు చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాకిచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్ సభ స్థానాలలో తామే పోటీ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ తమను విడిచిపెట్టిందని ఆరోపించారు. అంతకుముందు, ఈ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది.
ఇండియా కూటమి సీట్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి జమ్ములో రెండు స్థానాలను నేషనల్ కాన్ఫరెన్స్ వదిలివేసింది. కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'అభ్యర్థులను నిలబెట్టడం, ఎన్నికల్లో పోటీ చేయడం మినహా వారు (నేషనల్ కాన్ఫరెన్స్) మాకు వేరే ఆప్షన్‌ను వదిలిపెట్టలేదు' అని ముఫ్తీ వ్యాఖ్యానించారు.
మెహబూబా ముఫ్తీ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించడం అంటే ఆమె బహుశా ఎలాంటి పొత్తు కోరుకోవడం లేదనుకోవచ్చన్నారు. మొత్తం 5 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటే అది ఆమె ఇష్టమన్నారు. ముఫ్తీ ఫార్ములా ఆధారంగానే తాము కశ్మీర్‌లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామన్నారు. ఇండియా కూటమి సీట్ల పంపిణీలో భాగంగా జమ్మూలోని రెండు స్థానాలను కాంగ్రెస్‌కు వదిలేసినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె ఎలాంటి పొత్తు కోరుకుంటున్నట్లుగా కనిపించడం లేదన్నారు. తాము పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉంచామని... మూసివేస్తే అది తమ తప్పు కాదన్నారు.