Daggubati Purandeswari: సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

Purandeswari sent legal notice to CM Jagan

  • విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో పురందేశ్వరిపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు
  • రూ.20 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి
  • సీఎం జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో, సీఎం జగన్ కు పురందేశ్వరి ఈ నెల 1న లీగల్ నోటీసులు పంపారు. 

సాక్షి పేపర్లో గత నెల 22 నుంచి 24 వరకు వరుసగా మూడ్రోజుల పాటు  తనపై అసత్య కథనాలు ప్రచురించారని పురందేశ్వరి ఆరోపించారు. సంధ్యా ఆక్వా కంపెనీలో తన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి ఆ కంపెనీకి, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సంధ్యా ఆక్వా యాజమాన్యంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని తెలిపారు.  


సాక్షి పత్రిక ప్రచురణ సంస్థ జగతి పబ్లికేషన్స్ పరువునష్టం కింద రూ.20 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రిగా, వైసీపీ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురందేశ్వరి తన న్యాయవాది వీవీ సతీశ్ ద్వారా లీగల్ నోటీసు పంపారు. 

తాజాగా, ఈ అంశంపై పురందేశ్వరి సోషల్ మీడియాలో స్పందించారు. డ్రగ్స్ కేసులో దోషులను, అసలు నిజాలను దాచిపెడుతున్న వైసీపీ నేతలు ప్రతిపక్షాల మీద నెట్టివేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా ఆక్వా కంపెనీతో, తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

ఎలాంటి మచ్చ లేని నా రాజకీయ జీవితంపై జగన్, అతని అనుచరులు జగతి పబ్లికేషన్స్ ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ న్యాయపరమైన పోరాటం చేస్తున్నానని పురందేశ్వరి వెల్లడించారు.

  • Loading...

More Telugu News