YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు వైసీపీ నేతలు
- ప్రమాణం చేసిన వైవీ, మేడా, గొల్ల బాబూరావు
- ప్రమాణస్వీకారం చేయించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్
- 11కి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య
కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా... గొల్ల బాబూరావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. 97 మంది రాజ్యసభ సభ్యులతో బీజేపీ అగ్ర స్థానంలో ఉండగా... 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ప్రమాణస్వీకారానికి ముందు మీడియాతో గొల్ల బాబూరావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభలో దళితులకు అవకాశం కల్పించారని అన్నారు. సామాజిక న్యాయానికి జగన్ పెద్దపీట వేశారని కొనియాడారు. పేదల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.