Nara Lokesh: అ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు: సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు

Nara Lokesh criticises CM Jagan

  • నియంత జగన్ నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోశారని విమర్శలు
  • అప్పులు చేసి ఐదున్నర కోట్ల మంది భవిష్యత్తును తాకట్టు పెట్టాడని ఆగ్రహం
  • జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అంటూ ట్వీట్ 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ముంగిట తన విమర్శలకు పదునుపెట్టారు. అ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు... నియంత జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోశారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. 

"ఇన్ని అప్పులు చేసి రాష్ట్రంలో కనీసం రోడ్లు అయినా వేశారా? ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? అసలు, ఏపీకి రాజధాని ఉందా? ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తయిందా?" అంటూ లోకేశ్ నిలదీశారు. కనీసం జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

అంతేకాదు, ప్రతి మంగళవారం అప్పు పుడితేనే సర్కారు ఊపిరి పీల్చుకునే దుస్థితి అని పేర్కొన్నారు. 2023లో 52 మంగళవారాలు ఉంటే, 49 వారాలు ఆర్బీఐ నుంచి ఏపీ అప్పు తెచ్చిందని లోకేశ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News