Dastagiri: అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి పిటిషన్... విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
- అవినాశ్ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటున్న దస్తగిరి
- తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపణ
- దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా? అంటూ సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు
- సమర్థిస్తున్నామని బదులిచ్చిన సీబీఐ
- తదుపరి విచారణ ఏప్రిల్ 15కి వాయిదా
వివేకా హత్య కేసు నిందితుడు ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అవినాశ్ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటూ దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
అంతేకాకుండా, అవినాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని ఆరోపించాడు. తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి వివరించాడు.
ఇవాళ విచారణ సందర్భంగా... దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. అందుకు సీబీఐ స్పందిస్తూ, దస్తగిరి వాదనను సమర్థిస్తున్నామని బదులిచ్చింది. మరి అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
అయితే, తమ కంటే ముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని సీబీఐ సమాధానమిచ్చింది. సుప్రీంలో ఆమె పిటిషన్ పై విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ వివరణ ఇచ్చింది. దస్తగిరి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.
వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు దస్తగిరి పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
అటు, వివేకా హత్య కేసులో ఇతర నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, జి.ఉదయ్ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది.