Rahul Gandhi: తల్లి ఆకాంక్షలకు బాధితుడయ్యాడంటూ.. రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ కామెంట్
- రాహుల్ గాంధీ తన ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లి ఇష్టం కోసం రాజకీయ నాయకుడిగా మారాల్సి వచ్చిందని వ్యాఖ్య
- రాహుల్ గాంధీని పదేపదే యువ నాయకుడిగా లాంచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ
- పిల్లలు తమకు ఇష్టమైన పనిని చేసుకునే స్వేచ్ఛ ఉండాలని వ్యాఖ్య
ఏఐసీసీ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిగా ఆమె అభివర్ణించారు. తన తల్లి సోనియా గాంధీ ఆకాంక్షలకు రాహుల్ గాంధీ బాధితుడయ్యాడన్నారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీని బాధితుడిగా పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన తన ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లి ఇష్టం కోసం రాజకీయ నాయకుడిగా మారాల్సి వచ్చిందన్నారు.
అతను రాజకీయాల్లో రాణించగలడా? లేడా? అనే దానితో సంబంధం లేకుండా బలవంతంగా రాజకీయాలు రుద్దారని... దీంతో అతను తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. యాభై ఏళ్లు దాటిన రాహుల్ గాంధీ మరికొన్నేళ్లలో ఆరుపదుల వయస్సుకు చేరుకుంటాడని... అయినప్పటికీ, అతనిని పదేపదే యువ నాయకుడిగా లాంచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనను రాజకీయ వారసత్వ బాధితుడిగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీని రాజకీయ బాధితుడిగానే భావిస్తున్నానని.... పిల్లలు తమకు ఇష్టమైన పనిని చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్నారు. సినిమా పరిశ్రమలోనూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి చేసి సినిమా రంగంలోకి తీసుకువస్తే వారు విఫలమవడంతో వారి జీవితాలు నాశనమయ్యాయన్నారు.