Konda Surekha: లీగల్ నోటీసులు అందలేదు... వాట్సాప్లో చూశా: మంత్రి కొండా సురేఖ
- కేటీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచన
- ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేది అతనే... ఆ తర్వాత చేయలేదని చెప్పేది కూడా అతనే అని ఎద్దేవా
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు అధికారంలో ఉంటే వారే బాధ్యులవుతారని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులు తనకు అందలేదని మంత్రి కొండా సురేఖ చెప్పారు. నిన్న కూడా ఆమె ఈ అంశంపై స్పందించారు. గురువారం మరోసారి కేటీఆర్ పంపించారన్న నోటీసులపై స్పందించారు. తనకు ఎలాంటి నోటీసు అందలేదని... వాట్సాప్లో మాత్రమే చూశానని తెలిపారు. కేటీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేది అతనే... ఆ తర్వాత చేయలేదని చెప్పేది కూడా అతనే అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు అధికారంలో ఉంటే వారే బాధ్యులు అవుతారని... అందుకే బీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి, అధికారులు చూసుకుంటారని మంత్రి అన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.