Chandrababu: గతంలో ఏ ముఖ్యమంత్రిని అయినా సైకో అన్నామా?: చంద్రబాబు
- గోపాలపురంలో చంద్రబాబు ప్రజాగళం సభ
- సైకిల్ స్పీడ్ పెంచాలన్న టీడీపీ అధినేత
- ఫ్యాన్ ను తుక్కు తుక్కు చేయాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టీడీపీ శ్రేణులు స్పీడు పెంచాలని, ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా సైకో అనలేదని, ఇప్పుడెందుకు అంటున్నామో ఆలోచించాలని అన్నారు. టీడీపీ సభలో సైకో పాట పెడితే ప్రజలు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం చూస్తుంటే, వారిలో ఎంత ఆవేశం ఉందో అర్థమవుతోందని చంద్రబాబు వివరించారు.
మే 13న జరిగే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు రెండు బటన్లు నొక్కాలని, ఒక బటన్ సైకిల్ పై వెంకట్రాజు కోసం నొక్కాలని, మరో బటన్ పార్లమెంటు అభ్యర్థి పురందేశ్వరి కోసం కమలం గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు. మీరు నొక్కే బటన్ తో ఉత్తుత్తి బటన్ నొక్కేవాడ్ని ఇంటికి పంపిద్దాం అని వ్యాఖ్యానించారు.
"ఈ సీఎం ఎంత మోసం చేస్తాడంటే... అన్నీ నంగనాచి కబుర్లు చెబుతాడు. మొదట సిద్ధం అన్నాడు... ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నాడు. ఒక్కో మీటింగ్ కు 1500 బస్సులు... వీళ్ల అబ్బ సొమ్మా, ఈ రాష్ట్రం వీళ్ల తాత జాగీరా?
మనుషులకు డబ్బులిచ్చి, బిర్యానీ పెట్టి, మద్యం పోయించి మత్తులో ముంచి... వాళ్లను మీటింగ్ కు తీసుకొస్తున్నారు... అవునా, కాదా? రాకపోతే పెన్షన్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నారు... మీ తాత సొత్తా? ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది.
పోలవరం ఇక్కడే ఉంది... దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు. భారీ వరద సంభవిస్తే 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం వస్తే ఉభయ గోదావరి జిల్లాలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఇది ఇక బహుళ ప్రయోజక ప్రాజెక్టు. దీని ద్వారా 2 వేల టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. తద్వారా ఈ రాష్ట్రంలో కరవు అనే మాటే వినిపించదు.
ఆనాడు 2014లో ఇక్కడ నేను గెలిచాను, ఢిల్లీలో మోదీ గారు గెలిచారు. నేను ప్రమాణస్వీకారం చేయకముందే ప్రధాని మోదీని ఒక మాట అడిగాను. ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండిపోయాయి... అవి అక్కడే ఉంటే ప్రాజెక్టు సాధ్యం కాదు, అందుకే మీరు దయతలచి ఆ ఏడు మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పాను. ఆ ఏడు మండలాలు ఏపీకి రావడానికి కారణం నేనే. ఆ ఏడు మండలాలు మనకు రాకపోతే ఇవాళ పోలవరం ప్రాజెక్టే లేదు.
అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును 28 సార్లు సందర్శించాను, 82 సార్లు వర్చువల్ గా సమీక్షలు నిర్వహించాను. 414 రోజుల్లో డయాఫ్రం వాల్ పూర్తి చేశాను, 72 శాతం పనులు పూర్తి చేశాం, రూ.11,600 కోట్లు ఖర్చు చేశాం... కేంద్రం కూడా రీయింబర్స్ చేసింది.
ఈ జగన్ అధికారంలోకి వస్తూనే 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తానన్నాడు. మళ్లీ 2022కి మార్చాడు.... ఇప్పుడైతే ఎప్పుడు పూర్తి చేస్తాడో చెప్పే పరిస్థితి కూడా లేదు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశాడు, కాఫర్ డ్యాం నాశనం చేశాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.