Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం!
- చంబా జిల్లాలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం
- ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారుల ప్రకటన
- పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో స్వల్పంగా కంపించిన భూమి
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. ఊపరితలానికి అడుగున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఈ భూకంపం కారణంగా చండీగఢ్ నగరంతో పాటూ పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
అయితే, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని హిమాచల్ ప్రదేశ్ అధికారులు తెలిపారు. ‘‘కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. నేను భవంతి నుంచి కిందకు దిగిపోదామనుకుంటున్న తరుణంలో ప్రకంపనలు నిలిచిపోయాయి’’ అని స్థానికుడు ఒకరు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, 1905లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో సంభవించిన భారీ భూకంపం అప్పట్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో ఈ భూకంపం ఏకంగా 20 వేల మందిని బలితీసుకుంది.