Sunitha Kejriwal: భగత్ సింగ్, అంబేడ్కర్ మధ్య కేజ్రీవాల్ ఫొటో.. ఆప్ వివరణ
- గురువారం కేజ్రీవాల్ సందేశాన్ని ప్రజలకు వినిపించిన ఆయన భార్య సునీత
- సునీత గది గోడపై భగత్ సింగ్, అంబేడ్కర్ ఫొటోల మధ్య జైల్లో ఉన్నట్టు కేజ్రీవాల్ ఫొటో
- స్వాతంత్ర సమరయోధులతో అవినీతమయమైన వ్యక్తికి పోలికా? అంటూ బీజేపీ ఆగ్రహం
- బీజేపీపై కేజ్రీవాల్ పోరాటం స్వాతంత్ర్య సమయంతో సమానమని ఆప్ వివరణ
స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, బీఆర్ అంబేడ్కర్ ఫొటోల మధ్య ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫొటో పెట్టడంతము వివాదాస్పదం కావడంతో ఆప్ వివరణ ఇచ్చుకుంది. బీజేపీ కారణంగా అక్రమ అరెస్టుకు గురై కేజ్రీవాల్ చేస్తున్న పోరాటం స్వాతంత్ర్య పోరాటం కంటే తక్కువ కాదని వ్యాఖ్యానించింది. గురువారం కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన అర్ధాంగి సునీత కేజ్రీవాల్ ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె గది గోడపై భగత్ సింగ్, అంబేడ్కర్ ఫొటోల మధ్యలో కేజ్రీవాల్ ఫొటో ఉండటం తీవ్ర వివాదానికి దారి తీసింది.
సోషల్ మీడియాలో ఆప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఆప్ తీరును ఖండించింది. ఇలాంటి చర్యలతో ప్రజల్ని మాయచేయలేరని వ్యాఖ్యానించింది. అవినీతిమయమైన ఓ వ్యక్తి ఫొటో భగత్ సింగ్, అంబేడ్కర్ ఫొటోల మధ్య పెట్టడం విచారకరమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ మండిపడ్డారు. ‘‘ఒకప్పుడు కేజ్రీవాల్ కెమెరా ముందు అసత్యాలు వల్లెవేసేవారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి భార్యతో అసత్యాలు పలికిస్తున్నారు. ప్రజలను ఆప్ మోసం చేయలేదు’’ అని ఆయన అన్నారు.
ఆప్ వివరణ ఇదీ..
తప్పుడు ఆరోపణలతో బీజేపీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించిందని ఆప్ ఆరోపించింది. బీజేపీ నియంతృత్వంపై అరవింద్ కేజ్రీవాల్ పోరాటానికి ఈ చిత్రం చిహ్నమని పేర్కొంది. కేజ్రీవాల్ పోరాటం స్వాతంత్ర్య పోరాటానికంటే తక్కువ కాదని గుర్తు చేసేందుకే ఈ ఫొటో అని వివరించింది. ఒకప్పుడు దేశప్రజలు బ్రిటీష్ వారిపై పోరాడారని, నేడు వారు బీజేపీ నియంతృత్వంపై పోరాడాల్సి వస్తోందని, కేజ్రీవాల్ చేస్తోంది ఇదేనని వివరించింది.