Sumalatha Ambareesh: బీజేపీలో చేరిన మాండ్యా ఎంపీ, సినీ నటి సుమలత
- బెంగళూరులో బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుమలత
- 2019లో బీజేపీ మద్దతుతో మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సుమలత
- ఈసారి మాండ్యా నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి హెచ్‌డీ కుమారస్వామి
- కుమారస్వామికి మద్దతు ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన సుమలత
ప్రముఖ సినీ నటి, మాండ్యా ఎంపీ సుమలత (60) బీజేపీలో చేరారు. శుక్రవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, తాను బీజేపీలో చేరనున్నట్లు ఇటీవలే సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీజేపీలో చేరి, ఎన్డీయే అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామికి మద్దతు ఇస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు.
మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సుమలత తెలిపారు. గతంలో ఆమె తన భర్త అంబరీష్ మరణానంతరం మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సుమలత... కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి సహకారం లభించింది. అందుకు ఇప్పుడామె బీజేపీకి కృతజ్ఞత తెలుపుకుంటూ, పోటీ నుంచి విరమించుకున్నారు.