Vijayasai Reddy: డబ్బు కట్టలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఇది 90వ దశకం కాదు: విజయసాయిరెడ్డి
- నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విజయసాయి
- టీడీపీ నేతలు వేమిరెడ్డి, నారాయణలపై విమర్శలు
- సంపన్నులకు, వైసీపీ నిలబెట్టిన సాధారణ అభ్యర్థులకు మధ్య యుద్ధం అంటూ వ్యాఖ్యలు
- ఎవరిని ఎన్నుకోవాలో జనానికి పూర్తి క్లారిటీ ఉందన్న విజయసాయి
తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నెల్లూరు టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
విజయసాయి నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, విజయసాయి స్పందిస్తూ... వేమిరెడ్డి, నారాయణ లాంటి వేల కోట్ల సంపన్నులకు, వైసీపీ నిలబెట్టిన సాధారణ అభ్యర్థులకు జరుగుతున్న మహాసంగ్రామం ఇది అని అభివర్ణించారు.
పెత్తందారుల పల్లకీ మోయాలా? ప్రజల కోసం ఆరాటపడే నాయకులను ఎన్నుకోవాలా? అనే విషయంలో ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. డబ్బు కట్టలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఇది 1990వ దశకం కాదు అని ఉద్ఘాటించారు.