IAS Anuradha Pal: ఐఏఎస్ కావాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఉత్తరాఖండ్‌లోని జిల్లా ‌కలెక్టర్!

Meet IAS officer Anuradha Pal daughter of a milk seller

  • కోచింగ్ ఫీజు చెల్లించడానికి ట్యూషన్లు చెప్పిన అనురాధ పాల్‌
  • యూపీఎస్‌సీ పరీక్షలో రెండుసార్లు ఆల్ ఇండియా ర్యాంకుతో విజయం
  • మొద‌టి ప్ర‌య‌త్నంలో తాను అనుకున్న ఐఏఎస్ రాక‌పోవ‌డంతో రెండో ప్ర‌య‌త్నం
  • 2012లో ఆమెకు ఆల్ ఇండియా ర్యాంక్‌ 451.. 2015లో ఆల్ ఇండియా 62వ ర్యాంక్    
  • చివ‌ర‌గా 2015లో ఐఏఎస్ అయిన అనురాధ పాల్‌
  • ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా కలెక్టర్ గా విధులు  

కొంతమంది తాము అనుకున్నది సాధించ‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటారు. కానీ వారు త‌మ ల‌క్ష్యాన్ని వదలరు. అలా వారు త‌మ అచంచలమైన కృషి, అంకితభావం, పట్టుదలతో చివ‌రికి అద్భుతమైన విజయాల‌ను సాధించి లోకాన్ని విస్తుపోయేలా చేస్తుంటారు.

ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విజయగాథనే ఐఏఎస్‌ అనురాధ పాల్‌ది కూడా. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలో ఆమె రెండుసార్లు విజయం సాధించారు. హరిద్వార్‌లోని ఒక చిన్న గ్రామంలో నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చిన అనురాధ తన చిన్నతనంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు.

ఆమె హరిద్వార్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ త‌ర్వాత‌ పంత్ విశ్వ‌విద్యాల‌యంలో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి మారిన అనురాధ‌.. అక్క‌డ‌ టెక్ మహీంద్రాలో కొంత‌కాలం పని చేశారు. కానీ, ఆమెకు తాను చేస్తున్న ప‌నితో సంతృప్తి క‌ల‌గ‌లేదు. తాను సాధించాల‌నుకుంది ఇది కాదు అనిపించింది. 

అప్పుడే అనురాధ ఐఏఎస్‌ తన నిజమైన గోల్‌ అని గ్రహించారు. వెంట‌నే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె రూర్కీలోని ఒక కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా చేరారు. అక్క‌డ జాబ్ చేస్తూనే యూపీఎస్‌సీ కోసం ప్రిపేర్ అయ్యారు. అయినా, కోచింగ్ ఫీజుల‌కు డ‌బ్బులు స‌రిపోక‌ ఆమె విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పార‌ట‌.

చివరగా, ఆమె ఆల్ ఇండియా ర్యాంక్‌ 451తో 2012లో తన మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ, ఆ ర్యాంక్‌తో ఆమెకు ఐఏఎస్ రాలేదు. క‌లెక్ట‌ర్‌ కావాలనేదే ఆమె క‌ల‌. దాంతో అనురాధ మళ్లీ సివిల్ స‌ర్వీసుల కోసం ప్రిప‌రేష‌న్ ప్రారంభించారు. దాంతో ఆమె 2015లో తన రెండవ ప్రయత్నంలో ఆల్ ఇండియా 62వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ సాధించారు. అనురాధ‌ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా ‌కలెక్టర్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

  • Loading...

More Telugu News