VV Lakshminarayana: కవితను ప్రశ్నించేందుకు సీబీఐ వాళ్లు అందుకే త్వరపడినట్టు కనిపిస్తోంది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI Former JD Lakshminarayana opines on Kavitha case

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ
  • కవితను ప్రశ్నించేందుకు కోర్టును ఆశ్రయించిన సీబీఐ
  • సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
  • కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న లక్ష్మీనారాయణ
  • అయితే కోర్టు కొన్ని షరతులు విధించవచ్చని వెల్లడి 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా, కవితను విచారించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. 

"కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఆమెను ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. అందుకే సీబీఐ వారు కోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఓ మహిళను ప్రశ్నించే సమయంలో అక్కడ మహిళా అధికారులు తప్పకుండా ఉంటారు. విచారణ ఎదుర్కొంటున్న వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా, అక్కడ మహిళా కానిస్టేబుళ్లను, మహిళా అధికారులను ఉంచుతారు. 

ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరి పాత్ర ఏంటి అనేది తేల్చడానికి సీబీఐ దర్యాప్తు ఉపయోగపడుతుంది. మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తే... అవినీతి సంబంధిత అంశాల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తుంది. తమ పరిధి మేరకు సీబీఐ వారు చార్జిషీట్ వేస్తారు. 

తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయంటూ కవిత ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందునే సీబీఐ వాళ్లు త్వరపడినట్టు కనిపిస్తోంది. కవితకు బెయిల్ వస్తే విచారించడం కష్టమని భావించి, ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడే ప్రశ్నించే విధంగా సీబీఐ అడుగులు వేసినట్టు తెలుస్తోంది. 

ఆమెను ప్రశ్నించడం అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అందుకే సీబీఐ వాళ్లు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ఈ దశలో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనలేం. ఎందుకంటే, ఆమెపై మోపిన ఆరోపణలు, సేకరించిన సాక్ష్యాలు కోర్టులో నిలబడితేనే కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 

కవిత బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు తీర్పు రానుంది. ఆ తర్వాత ఆమె ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో రెగ్యులర్ బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ కోరుతున్నారు కాబట్టి, కోర్టు ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవచ్చు. పరీక్షల వేళ పిల్లలకు తల్లి అవసరం ఉంటుందన్న కోణంలో కోర్టు ఈ అంశాన్ని చూసే అవకాశం ఉంది. 

అందుకే, పరీక్షల వరకే వర్తించేలా తాత్కాలిక బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, సాక్షులను ప్రభావితం చేయరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, రాజకీయ ప్రకటనలు చేయనాదని కూడా షరతులు విధించొచ్చు. ఒకవేళ ఈ కోర్టు బెయిల్ ఇవ్వకపోతే కవిత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లవచ్చు. 

ఇప్పుడు కవిత ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అందువల్ల ఈడీ వారు ఆమెకు ప్రతి 15 రోజులకు ఓసారి రిమాండ్ పెంచుకుంటూ పోయేందుకు ప్రయత్నిస్తారు. 

ఈ కేసులో మనీశ్ సిసోడియా ఒక ఏడాదిగా జైల్లో ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఆరోగ్య కారణాలతో బయటికి వచ్చారు. సంజయ్ సింగ్ కు కూడా బెయిల్ వచ్చిందని నేను విన్నాను కానీ, నిజంగా వచ్చిందో లేదో గమనించలేదు. సహజంగానే దర్యాప్తు సంస్థలు నిందితులకు బెయిల్ ఇవ్వవద్దనే కోర్టులను కోరుతుంటాయి" అంటూ లక్ష్మీనారాయణ తన విశ్లేషణను తెలియజేశారు.

  • Loading...

More Telugu News