Uttam Kumar Reddy: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ముఖ్యమంత్రిగా కేసీఆర్ అడ్డగోలుగా ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు బొంద పెట్టారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- లత్కోర్... రండలు... చవటలు... దద్దమ్మలు... ఇవేం మాటలని ఆగ్రహం
- కేసీఆర్ అలా మాట్లాడినందుకు సిగ్గు శరం ఉండాలని ధ్వజం
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఇవాళ ఆయన మీడియా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒళ్లంతా పొగరుతో నిండిపోయి... కళ్లు నెత్తికెక్కి... ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొంద పెట్టారని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. అందుకే 104 ఎమ్మెల్యేల నుంచి 39 మందికి పడిపోయారని... ఇప్పుడు అందులోను 20, 25 మంది కాంగ్రెస్లో చేరబోతున్నారన్నారు.
తెలంగాణలో ఇరిగేషన్ శాఖను, ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది కేసీఆర్ అని విమర్శించారు. నిన్న కేసీఆర్ మాట్లాడిన భాష దారుణంగా ఉందని మండిపడ్డారు. లత్కోర్... రండలు... చవటలు... దద్దమ్మలు అని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ గారూ... మేమేం దొంగ పాస్పార్టులు అమ్మి రాజకీయాల్లోకి రాలేదు... గొప్ప చరిత్రతో వచ్చాం... బాధ్యతలను నిజాయతీగా నెరవేరుస్తున్నాం అన్నారు. మీలా కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా పని చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అలా మాట్లాడినందుకు సిగ్గు శరం ఉండాలని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాలను అక్రమంగా ఏపీకి తరలించారన్నారు. రూ.90వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టలేకపోయావని విమర్శించారు. కేసీఆర్ చేసిన దోపిడీకి వేరే దేశాల్లో అయితే ఉరిశిక్ష వేస్తారన్నారు. ఉన్న నీటిని రైతులకు ఏవిధంగా ఉపయోగించాలో నిత్యం సమీక్షిస్తున్నామన్నారు. వారి ఇబ్బందులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.